రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జలకళతో కళకళలాడుతున్న చెరువులు, పచ్చదనంతో నిండుగా అలరారుతున్న పొలాల పక్కన ప్రకృతిలో మమేకమై రాష్ట్ర ఆడబిడ్డలంతా సంబురంగా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మహిళల ఆటపాటలతో ఈ తొమ్మిది రోజులు రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని అన్నారు.
విజయాలను అందించే విజయదశమిని స్వాగతిస్తూ.. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని కేసీఆర్ ప్రార్థించారు.
మరోవైపు దసరా రోజున జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ దసరా రోజున మధ్యాహ్నం ఒంటి గంట 10 నిమిషాలకు పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గం తీర్మానం చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.