పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఓ యుద్ధనౌక గుజరాత్ తీరంలో సముద్ర సరిహద్దు రేఖను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. అయితే, భారత తీర రక్షక దళానికి చెందిన సముద్ర నిఘా విమానం ‘డోర్నియర్’ వెంటనే దాన్ని గుర్తించడంతో.. కాసేపటికి తోకముడిచింది. జులైలో భారీ వర్షాలు కురుస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు ఓ వార్తా సంస్థకు వెల్లడించాయి.
‘‘పీఎన్‌ఎస్ ఆలంగీర్’ రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు రేఖ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించింది. సముద్ర తీరంలో నిఘా కోసం అప్పటికే సమీప వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ‘డోర్నియర్’ విమానం.. ఈ నౌక ఆచూకీని గుర్తించింది. దానిపై నిఘా కొనసాగిస్తూనే.. దాని ఉనికి గురించి కమాండ్ సెంటర్‌కు సమాచారం అందించింది. మరోవైపు.. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ పాక్ యుద్ధనౌకకు హెచ్చరికలూ జారీ చేసింది. అయితే, నౌకా సిబ్బంది వాటిని పట్టించుకోలేదు’ అని సంబంధిత అధికారులు తెలిపారు.
‘‘పీఎన్‌ఎస్ ఆలంగీర్’ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్న ‘డోర్నియర్’.. నౌక ఉద్దేశాన్ని కనిపెట్టేందుకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా సంప్రదించేందుకు యత్నించింది. అయితే.. పూర్తి నిశ్శబ్దాన్ని కొనసాగించాలని భావించిన ఆలంగీర్ కెప్టెన్.. దానికి స్పందించలేదు. అయితే, కొద్దిసేపటికి తమ ఉనికిని పసిగట్టేశారని తెలుసుకున్న నౌక సిబ్బంది వెనక్కి తగ్గారు’ అని తెలిపారు.