వేల కోట్లు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి… రైతుల ధాన్యాన్ని కొనం అంటున్నారు.- రేవంత్ రెడ్డి.

వరి ధాన్యం కొనుగోళ్లు తెలంగాణలో కాక రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ వరి ధాన్యాన్నికొనుగోలు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, బీజేపీ పార్టీలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 7 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసి మరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు.. కమీషన్ల రూపంలో మీరు వేల కోట్లు సంపాదించుకున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ 10 వేల కోట్ల పెట్టి రైతుల ధాన్యాన్ని కొనేందుకు కేసీఆర్ కు దైర్యం రావడం లేదంటే.. రైతుల పాలిట నీవు ఓ కసాయిగా తయారయ్యావని విమర్శించారు. రైతు వ్యతిరేఖి కేసీఆర్ అని దుయ్యబట్టారు.

ధర్నాలో రైతుల ధాన్యం కొంటామని ఏమైనా ప్రకటన చేస్తారని.. లేకపోతే కేంద్రంలో కొనేలా కార్యాచరణ రూపొందిస్తారని ఆశించామని.. అయితే కేసీఆర్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేని … కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసిన ధర్నా..స్టార్ హోటళ్లలో సినిమా వాళ్ల వ్యవహారంలా ఉందని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి.

బండి సంజయ్ నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ పర్యటనలు వీధినాటకాలను తలపిస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల కోసం బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు మోడీ నిలదీయాలన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాటకంలో రైతుల బలిపశువులు అవుతున్నారన్నారు. రైతుల్ని తొక్కడానికి బండి సంజయ్, టీఆర్ఎస్ పార్టీలు నాటకమాడుతున్నాయన్నారు. బండి సంజయ్, కేసీఆర్ ను జైలుకు పంపిస్తున్నామని పదేపదే చెబుతారు ..కానీ ఇప్పటి వరకు సహారా కుంభకోణంలో ఛార్జీషీటు కూడా వేయలేదని విమర్శించారు.