యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బీభీత్సం సృష్టిస్తోంది. దీంతో.. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 20 రోజుల్లో 248 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకి ఉండొచ్చని అంచనా. అంటే చైనా జనాభాలో దాదాపు 18 శాతం మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబరు చివరి వారంలో ఒక్క రోజులోనే 3.7కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా పరిణామం చెందుతుందని భావిస్తోంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) బుధవారం అత్యవసరంగా భేటీ అయ్యింది. కొవిడ్ వ్యాప్తిని ఎలా అరికట్టాలన్న అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొవిడ్‌ను కట్టడిచేసేందుకు అవలంబించిన జీరో కొవిడ్ పాలసీ వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గి.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాప్తి చెందడానికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వ్యాప్తిలో చిచువాన్ ప్రావిన్స్‌లోని సౌత్‌వెస్ట్, బీజింగ్‌లో సగానికిపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడే అవకాశముందని ఎన్‌హెచ్‌సీ అంచనా వేస్తోంది. అయితే చైనా హెల్త్ రెగ్యులేటరీ ఈ అంచనాలకు ఎలా వచ్చిందన్న అంశంపై స్పష్టత కొరవడింది.