తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు మిర్చి యార్డులో కరోనా కలకలం రేగింది. మార్కెట్ లో ముగ్గురు వ్యాపారులకు పాజిటివ్ అని రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. నిత్యమూ వందల సంఖ్యలో రైతులు తమ మిర్చి పంటను తెచ్చి అమ్మే ప్రాంతంలో వైరస్ కలకలం రేపడంతో అంతా ఆందోళనకు గురౌతున్నారు.
వెంటనే అధికారులు అప్రమత్తమై శానిటైజేషన్ చేసి మార్కెట్ ను మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి సోమవారం నాడు పరిస్థితిని సమీక్షించి యార్డును తెరిపిస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో రైతులు ఎవరూ పంట తీసుకురావద్దని సూచించారు. వ్యాపారులతో సన్నిహితంగా ఉన్న దళారీలు, కూలీలు, రైతులను గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం యార్డు మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు.