కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని ప్రభావాన్ని తట్టుకోలేక ప్రపంచం మొత్తం విలవిలలాడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దాని బారిన పడ్డారు. లక్షల మంది ప్రాణాలు వదిలారు. అది సోకని దేశమేలేదు. అది వెళ్లని ఊరే లేదు. ప్రపంచం నలుమూలలా దాని పేరే ఇప్పటికీ వణికిస్తోంది. అయితే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఎలా పుట్టింది అనే అనుమానాలు ఇప్పటికీ ప్రంపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇక మొదటి నుంచి కూడా చైనాలోని ల్యాబ్‌ల నుంచే ఇది లీక్ అయిందనే అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
చైనా ల్యాబ్ లో డెవలప్ చేసిన ఈ వైరస్ అనుకోకుండా బయటకు వచ్చిందనే ఆరోపణలు ప్రపంచ దేశాలు సైతం చేస్తున్నాయి. ఇంత బలమైన ఆరోపణలు వచ్చే సరికి ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు కూడా దీనిపై అలర్ట్ అయ్యారు. ఇప్పటికే దీనిపై వివరణ ఇవ్వాలని చైనాను కూడా కోరారు. అంతే కాదు ఏకంగా చైనాకు డబ్ల్యూహెచ్‌వో నుంచి ఒక బృందం కూడా వెళ్లింది. ఇక ఇందులో ఉన్న పీటర్ బెన్ ఎంబరెక్ అనే ప్రతినిధి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో.. వాస్తవానికి కరోనా కేసులు మొదటి సారి బయటపడ్డ ఏరియాలోనే ఉండే ఒక ల్యాబ్ లో ఈ కరోనా తయారైందని చెప్పారు.
అయితే దాని భద్రతా ప్రమాణాలపై మొదట్లోనే తమకు అనుమానాలు వచ్చాయని చెప్పడం సంచలనం రేపుతోంది. ఇక ఈ అనుమానాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే చాలా విషయాలు వస్తాయని చెబుతున్నారు. ఇక కరోనా వైరస్ పుట్టుకను కనుగొనే క్రమంలో వారు చైనాకు వెళ్లిన సమయంలో అక్కడ ఉండే ల్యాబ్ ప్రమాణాలపై తమ బృందానికి కొన్ని అనుమానాలు తలెత్తాయని, కానీ దానిపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా చైనా అధికారులు తమపై ఒత్తిడి తెచ్చారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.