కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్రవారం (10-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ట్యుబర్‌క్యులోసిస్ (టీబీ) రాకుండా చూసే బీసీజీ అనే వ్యాక్సిన్.. కరోనా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లు చనిపోయే అవకాశాలను బాగా తగ్గిస్తుందని అమెరికాకు చెందిన పరిశోధకులు తేల్చారు. బీసీజీ టీకాలను తీసుకున్న పలు దేశాల్లో కరోనా బారిన పడ్డవారు త్వరగా కోలుకోవడమే కాక.. వారు తక్కువ సంఖ్యలో చనిపోతున్నారని సైంటిస్టులు వెల్లడించారు.
2. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స తీసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేక కరోనా కవచ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించాలని IRDA దేశంలోని ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీలకు సూచించింది. 3, 6, 9 నెలల కాల పరిమితితో పాలసీలను అందజేయాలని తెలిపింది.
3. కరోనా బారిన పడ్డవారు ఉండే ప్రదేశంలోని గాలిలోనూ ఆ వైరస్ ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. ఇదివరకే ఈ విషయమై పలువురు సైంటిస్టులు ఆ సంస్థకు సిఫారసు చేయగా.. ఆ సంస్థ ఆ విషయం నిజమే అని తేల్చింది. కరోనా రోగులు ఉండే ప్రదేశంలోని గాలిలో ఆ వైరస్ కణాలు ఉంటాయని, రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుంచి వెలువడే కణాలు అక్కడి గాలిలో కొంత సేపు ఉంటాయని.. కనుక జాగ్రత్తలు వహించాలని ఆ సంస్థ సూచించింది.
4. కరోనా బాధితుల సంఖ్య దేశవ్యాప్తంగా 8 లక్షలు దాటింది. మొత్తం 8,01,286 మందికి కరోనా సోకింది. నిత్యం 20వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో శుక్రవారం భారత్ ఆ సంఖ్యను దాటింది. మొత్తం కేసుల్లో 2,30,599 తో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
5. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం ఇ-ఆఫీస్‌ను సోమవారం నుంచి ప్రారంభించనుంది. ఇందుకు ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయి. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని పనులు ఇక ఆన్‌లైన్‌లోనే పూర్తి కానున్నాయి.
6. కరోనా వైరస్ వల్ల దేశంలోని ఫార్మా రంగం వృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. ఈ మేరకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనాను అరికట్టాలనే ఉద్దేశంతో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ కోసం రీసెర్చి చేస్తున్నాయని, అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఆ కంపెనీలు ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తాయని మూడీస్ పేర్కొంది.
7. కరోనా కాలంలో పోలీసుల పాత్ర చాలా కీలకమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న 45 మంది పోలీసు సిబ్బంది సీపీ ఆధ్వర్యంలో తిరిగి విధుల్లో చేరారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా బారిన పడకుండా ఉంటామని ఆయన తెలిపారు.
8. కోవిడ్ బారిన పడి హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం 1800 599 4455 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా విడతల వారీగా ఎగ్జిక్యూటివ్‌లతో కోవిడ్ పేషెంట్లకు కావల్సిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
9. సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో తాజాగా విపరీతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలువురు సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వివరాలను తెలపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలు చేయవద్దని, కావాలంటే హెబియస్ కార్పస్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.
10. కజఖ్‌స్థాన్‌లో గుర్తు తెలియని న్యుమోనియా వ్యాధి వల్ల ఈ ఏడాది ఆరంభం నుంచి 1772 మంది చనిపోయారు. కేవలం జూన్ నెలలోనే 628 మంది చనిపోయారు. కోవిడ్‌తో పోలిస్తే ఈ వ్యాధి మరణాల రేటు ఎక్కువగా ఉంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టతనివ్వాల్సి ఉంది. ఇది కూడా ఒక వైరసేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.