ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ సీపియం పార్టీ శిక్షణ తరగతుల్లో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా పెట్టడం వల్ల టీఆర్ఎస్‌కు ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎటువంటి ఉపయోగం ఉండదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చు రేపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో మతాల పట్ల బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో పోరాడే పార్టీ మాదని తమ్మినేని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చలేదు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలు అన్నిటినీ ఐక్యం చేసి ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంపును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు.