ఈరోజు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నేపధ్యం లో అన్ని పార్టీలు తమ ప్రచారానికి వ్యూహాలు సిద్దపడుతున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడూ గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఎప్పుడూ కింగ్ మేకర్‌గా జేడీఎస్‌కు ఈసారి ఆ అవకాశం ఉండదని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకుగాను మూడింట రెండొంతుల సీట్లు తమకే వస్తాయని తెలిపారు.
ఈసారి తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదల్చుకోలేదని శివకుమార్ తెలిపారు. ఎప్పుడూ కింగ్ మేకర్‌గా జేడీఎస్‌కు ఈసారి ఆ అవకాశం ఉండదని చెప్పారు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను మించి తాము ఘన విజయం సాధిస్తామని తెలియచేశారు డీకే శివ కుమార్. కన్నడ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు.
బీజేపీ అధికారం కోసం రాష్ట్ర ప్రజలకు దాదాపు 600కు పైగా హామీలు ఇచ్చిందని, కానీ వాటిలో కేవలం 50 హామీలను మాత్రమే నెరవేర్చిందని డీకే శివకుమార్ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మత రాజకీయాలపైనే తప్ప అభివృద్ధిపై దృష్టిసారించలేదని ఆయన అన్నారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.