హుజూరాబాద్ బైపోల్ వేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ముగిసే దాకా దళితబంధును నిలిపివేయాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలను జారీ చేసింది. దళిత బంధు పథకం అమలుపై పలు ఫిర్యాదులు అందడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ పథకం అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీ భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రతిష్టాత్మకంగా దళిత బంధును ప్రవేశపెట్టింది. ముందుగా హుజూరాబాద్ లోనే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు తగ్గట్లుగా దళితబంధు ద్వారా పలువురు లబ్ధిదారులకు ఆర్థిక సాయం కూడా అందింది. అయితే పథకం అమలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో ముడిపడి ఉందని, ఇది టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని ఇతర రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.