టర్కీ-సిరియా దేశాల్లో మృత్యుఘోష ఇంకా కొనసాగుతోంది. ఏ రాయి కింద చూసినా మృతదేహమే కనిపిస్తోంది. శిథిలాల కింద కొన్ని మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిస్తున్నాయని సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది చెబుతున్నారు. భూకంపాల ధాటికి ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకు 37వేలకు పైగా మంది మృత్యువాత పడ్డట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఒక టర్కీలోనే 37,000 మంది మరణించగా.. సిరియాలో 5,714 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుని సాయం కోసం వేచి చూస్తున్నారు. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది ప్రజల్ని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భూకంపం సంభవించి వారం రోజులు పూర్తవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.