లాక్ డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నాం… సుప్రీం కోర్ట్ కు తెలిపిన ఢిల్లీ సర్కార్

-

ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీం కోర్ట్ లో వాడీవేడి చర్చ సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో వాయుకాలుష్యం నివారణకు రెండు రోజుల లాక్ డౌన్ ను పరిశీలించాలని సుప్రీం కోర్ట్ ఢిల్లీ సర్కార్ కు సూచించింది. కాగా సోమవారం ఢిల్లీ సర్కార్ లాక్ డౌన్ విధించేందకు సిద్ధమే అని అఫిడవిట్ జారీ చేసింది. ఇప్పటి వరకు వాయు కాలుష్యం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సుప్రీం కోర్ట్కు వివరించింది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్యానికి ప్రధాన దోషులు రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే కాకుండా కొన్ని ప్రాంతాలలో చెత్తను కాల్చడం ప్రధాన కారణాలని సుప్రీంకోర్టు నిర్ధారించింది. పంట వ్యర్థాలు వల్ల కేవలం 10 శాతం మాత్రమే కాలుష్యానికి కారణమవుతుందని అభిప్రాయపడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నిర్మాణాన్ని నిలిపివేయడం, అనవసరమైన రవాణా, పవర్ ప్లాంట్లను ఆపేయడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయడం వంటి అంశాలపై రేపు అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈరోజు ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్  అధికారులతో సమావేశం కానున్నారు. కాలుష్య సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, ఢిల్లీ మెట్రో, డీటీసీ ఛార్జీల పెంపుపై చర్చించనున్నారు. ఢిల్లీ కాలుష్య నివారణ అంశాన్ని సుప్రీం కోర్ట్ ఈనెల 17కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version