కరోనా ఆంక్షలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి

ఢిల్లీలో కోవిడ్ తీవ్రత తగ్గుమఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాటు దుకాణాల సరి-బేసి విధానాన్ని తొలగించింది. అయితే రాత్రి కర్ఫ్యూను మాత్రం అలాగే కొనసాగించాలని నిర్ణయించింది.

దీంతో పాటు 50 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లకు, బార్లకు, రెస్టారెంట్లకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సిబ్బందితో పనిచేయనున్నాయి. వివాహ వేడుకలకు 200 మంది వరకు అనుమతించారు. అయితే స్కూళ్ల, కాలేజీల ఓపెన్ చేయడంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా మాస్క్ ధరించడం, భౌతికదూరాన్ని పాటించేలా కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా అమలు చేయాలని డిడిఎంఎ అధికారులను ఆదేశించింది.