ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాజీ పీఏ బిభవ్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.కేసు దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని బిభవ్ కుమార్ పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణం లేదని జస్టిస్ అనూప్ కుమార్ పిటిషన్‌ను తిరస్కరించారు. బిభవ్ కుమార్ ఓ సీఎం పీఏ కావడం వల్ల సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడింది.
మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్‌పై బీభవ్ కుమార్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే .మే 18న అతడిని అరెస్ట్ చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, దర్యాప్తు పూర్తయిన కారణంగా కస్టడీ అనవసరమని బెయిల్ కోసం బీభవ్ కుమార్ కోర్టును అభ్యర్థించారు. ఢిల్లీ పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ జైన్ మాట్లాడుతూ.. బిభవ్ కుమార్ అరెస్ట్ సమయంలో అన్ని చట్టపరమైన విధానాలు అనుసరించినట్టు తెలిపారు. అలాగే, హడావుడిగా తనను అరెస్ట్ చేశారని బిభవ్ కుమార్ చేసిన ఆరోపణలపై అరెస్ట్ మెమో అందించడం, అరెస్టుకు గల కారణాలను వివరించడం, బిభవ్ కుమార్ భార్యకు సమాచారం ఇవ్వడం వంటివి జరిగాయని ఆయన తెలిపారు.