కోవిడ్ రెండో ప్రభావం దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. ఇంకొన్ని రోజులు ఆగితే కేసుల సంఖ్య భారీగా తగ్గనుంది. అయితే కోవిడ్ మూడో వేవ్ ప్రభుత్వాలను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రెండో వేవ్ లో భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మూడో వేవ్‌లో ఇంకా రెట్టింపు స్థాయిలో కోవిడ్ తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా ప్లస్ వేరియెంట్ Delta Plus variant తో కోవిడ్ మూడో వేవ్ రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ రెండో వేవ్‌లో డెల్టా వేరియెంట్ చాలా మందికి సోకింది. అది కె417ఎన్ గా మ్యుటేషన్‌కు గురై డెల్టా ప్లస్ వేరియెంట్‌గా మారింది. అయితే రెండో వేవ్‌లో డెల్టా వేరియెంట్ వల్ల చాలా మందికి ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల డెల్టా ప్లస్ వేరియెంట్‌తో కోవిడ్ మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇతర ఏవైనా వేరియెంట్ల ప్రభావం వల్ల మూడో వేవ్ రావచ్చని అంటున్నారు.
కాగా దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పంపిణీని మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని, దీంతో మూడో వేవ్ ప్రమాదాన్ని అరికట్టవచ్చని సూచిస్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేయకపోయినా కనీసం ఒక్క డోసు అయినా వేస్తే కోవిడ్ తీవ్ర రూపం దాల్చకుండా నివారించవచ్చని, దీంతో ప్రజల ప్రాణాలను కాపాడుకున్న వారమవుతామని అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నాటికి దేశమంతా టీకాల పంపిణీని పూర్తి చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఆ కార్యక్రమం పూర్తవుతుందా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.