పవన్ కళ్యాణ్ తన మార్క్ రాజకీయం చూపించారా

-

అటు రాజకీయం..ఇటు సాంకేతికం..దివీస్ సమస్యపై పవన్ కళ్యాణ్ మొత్తానికి తన మార్క్ రాజకీయం చూపించారు. దివిస్ ఫ్యాక్టరీకి తాము వ్యతిరేకం కాదని, సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను ఆధిగమించాలని పవన్ సూచించారు. అలాకాదని అడుగులు వేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసు ఆంక్షల నడుమ పవన్ మధ్యేమార్గంగా ప్రసంగాన్ని ముగించారు.దివీస్ పర్యటనలో జనసేనాని లక్ష్యం నెరవేరిందా ?

ఏపీలో దివీస్ లేబరేటరీస్ వ్యవహారం వివాదంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.. దివీస్ ల్యాబ్‌ను నిలిపేస్తామన్న అధికార పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టంవాటిల్లే ప్రమాదముందని.. అలాగే భూగర్భ జలాలు కలుషితమైన వ్యవసాయం, జనజీవనానికి ఇబ్బందులెదురవుతాయని స్థానికులు అంటున్నారు.

ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని.. ఈసారి తూర్పుగోదావరి జిల్లాని ఎంచుకున్నారు. కృష్ణా టూర్‌లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను టార్గెట్ చేసిన పవన్.. ఈసారి కన్నబాబును టార్గెట్ చేస్తారనే చర్చ జరిగింది.కానీ పోలీసుల ఆంక్షల నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొండంగి మండలంలోని వలస పాకలలో పర్యటించారు. అన్నవరం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వచ్చిన పవన్ దివీస్ రైతులకు మద్దతుగా బహిరంగసభలో పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అరెస్టై జైలులో ఉన్న వారి కుటుంబాలను పరామర్శించారు. దివీస్‌ విషయంలో వైఎస్ జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించిన పవన్.. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని అన్నారు.

అరెస్ట్ చేసిన 36మంది రైతులను వెంటనే విడుదల చేయాలనీ పవన్ డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన ప్రస్తుత రోజుల్లో మురుగు నీటిశుద్ధికి అవకాశం ఉందని, లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని… పచ్చని ఊళ్లలో కాలుష్యం చిచ్చు పెట్టవద్దని పవన్ అన్నారు. అలా కాదని ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు..

మొత్తం మీద తుని ఘటన తర్వాత భద్రత విషయంలో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభలకు ఆంక్షలతో కూడిన అనుమతులే ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా.. పవన్.. వైఎస్ జగన్ వీడియోలు ప్రదర్శించి.. దివీస్‌కు సాంకేతిక సలహాలు ఇఛ్చి పర్యటన ముగించారు.

Read more RELATED
Recommended to you

Latest news