తెలంగాణ బడ్జెట్‌పై ఇవాళ ఉభయ సభల్లో సాధారణ చర్చ జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ పై ఇవాళ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమాధానం ఇస్తారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్‌పై చర్చ చేపడతారు. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ చేపడతారు. మన ఊరు – మన బడి, జంటనగరాల్లో సీసీటీవీలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా ఫించన్లు, నకిలీ విత్తనాలు – ఎరువులు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఎ.సీతారామరెడ్డికి కౌన్సిల్ సంతాపం తెలపనుంది.