తెలంగాణ బడ్జెట్‌పై ఉభయ సభల్లో సాధారణ చర్చ ప్రారంభమైంది. శాసనసభలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చర్చను ప్రారంభించారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపట్టారు.
ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించింది. దివంగత మాజీ ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఎ. సీతారామ రెడ్డికి కౌన్సిల్ సంతాపం తెలిపింది. కౌన్సిల్‌లో ప్రశ్నోత్తరాల కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ చేపడతారు. మన ఊరు – మన బడి, జంటనగరాల్లో సీసీటీవీ కెమేరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా ఫించన్లు, నకిలీ విత్తనాలు – ఎరువులు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి.