పాలమూరు పోరు: శ్రీనివాస్ గౌడ్‌తో డీకే అరుణ ఢీ!

-

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. బి‌జే‌పి ఫైర్ బ్రాండ్ నాయకురాలు డీకే అరుణ..మంత్రి శ్రీనివాస్ గౌడ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇటీవల స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో మాజీ మంత్రి డీకే అరుణ..శ్రీనివాస్ గౌడ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బంధువులు ఎక్కడకక్కడ భూ దందాలు చేస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో పలు ఆరోపణలతో అరెస్ట్ అయ్యారని ఫైర్ అయ్యారు.

అటు బి‌జే‌పి నేత పి. చంద్రశేఖర్ సైతం శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. ఇక శ్రీనివాస్ గౌడ్..బి‌జే‌పి నేతలకు కౌంటర్లు ఇచ్చారు. ఓ మాజీ మంత్రి భర్త కాంట్రాక్ట్ తీసుకుని జిల్లాలో నిర్మించాల్సిన కొన్ని బ్రిడ్జిలని నిర్మించలేదని, మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు నీరు తరలించి..ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే చిచ్చు రేపటానికి వస్తున్నారని అరుణ టార్గెట్ గా శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇలా పాలమూరులో డీకే అరుణ, శ్రీనివాస్ గౌడ్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది.

dk aruna

అయితే వచ్చే ఎన్నికల్లో ఈ సారి గద్వాల్ నుంచి కాకుండా మహబూబ్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అరుణ చూస్తున్నారని తెలిసింది. అందుకే అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని టార్గెట్ చేశారని తెలుస్తోంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అరుణ..బి‌జే‌పి నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో మహబూబ్ నగర్, మక్తల్ నియోజకవర్గాల్లో బి‌జే‌పికి మెజారిటీ వచ్చింది.

దీంతో అరుణ మహబూబ్ నగర్ అసెంబ్లీలో పోటీ చేయాలని చూస్తున్నారని తెలిసింది. అక్కడ పోటీ చేస్తే గెలవడం సులువు అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి శ్రీనివాస్ గౌడ్, అరుణల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news