మ్యూచువల్ ఫండ్స్.. ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న పెట్టుబడి మార్గం. మార్కెట్ రిస్కులకి అనుగుణంగా ఉన్నప్పటికీ దీనిపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. ఐతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్ళు కొన్ని ముఖ్య విషయాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ప్రశ్నలేంటో తెలుసుకుందాం.
మీ లక్ష్యం ఏంటి?
మ్యూచువల్ ఫండ్లలో ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారనేది తెలుసుకోండి. మీరు పెట్టే పెట్టుబడి ఏ ఉద్దేశ్యంతో పెడుతున్నారు? మీ రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడుతుందనా? మీ పిల్లల చదువులకి ఉపయోగపడుతుందనా? మీ కోరికల్లో ఒకటైనా ప్రపంచ పర్యాటకానికి సహకరిస్తుందనా? అసలెందుకోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారనేది తెలుసుకోండి. మీ లక్ష్యాన్ని బట్టి ఫండ్ ఎంచుకోండి. అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని పెట్టుబడి పెట్టవద్దు.
ఫండ్ మేనేజర్ ఎవరు
చాలామంది అనుకుంటారు ఫండ్ మేనేజర్ గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరమే లేదని. కానీ అది నిజం కాదు. ఫండ్ మేనేజరే ఫండ్ ని మేనేజ్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫండ్ మేనేజర్ అంతకుముందు నడిపిన ఫండ్స్ పర్ఫార్మెన్స్ చూడండి.
మీరు తీసుకునే మ్యూచువల్ ఫండ్ కి ట్యాక్స్ వర్తిస్తుందా?
మీకు వచ్చే రిటర్న్స్ ట్యాక్స్ తో పాటు వస్తాయా? లేదా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. దానివల్ల మీ లాభం ఏంటనేది అర్థం అవుతుంది. అదీగాక మీరు ఆదాయ పన్ను కడుతున్నట్టయితే దానిలోని కొంత మొత్తానికి టాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా (సెక్షన్ 80సి కింద) చేసుకునే సౌలభ్యం ఉందా తెలుసుకోండి.
మీరు ఎంచుకునే ఫండ్ ఎలాంటి రకం?
అంటే అది క్లోజ్ ఎండెడ్ ఫండా? లేదా ఎప్పుడైనా నగదు తీసుకోగలిగే ఫండా అనేద తెలుసుకోండి. క్లోజ్ ఎండెడ్ ఫండ్ తీసుకుంతే గనక కొన్ని రోజుల పాటు మీ డబ్బులు ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. తీసుకునే అవకాశమే ఉండదు.