ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మధ్య డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటిఆర్‌ల మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే ఇటు ఏపీలో సైతం డ్రగ్స్ అంశం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే గుజరాత్ డ్రగ్స్‌తో విజయవాడ లింకులపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ… తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి డ్రగ్స్ వ్యవహారంపై ఫోకస్ చేసింది.
ఇటీవల జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు గంజాయి తరలిస్తూ అరెస్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలు ఆవాస్తవమని కావాలనే ప్రత్యర్ధులు తమపై విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అటు ఎమ్మెల్యే తనయుడు సైతం హైదరాబాద్‌లో ఒక రెండు వాహనాల్లో 60 కిలోల గంజాయి పట్టుబడితే… తనని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయని, గంజాయితో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు.
అయితే దీనిపై టిడిపి నేత పట్టాభి రచ్చ చేస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని హడావిడి చేస్తున్నారు. పైగా సవాల్ విసిరి…హైదరాబాద్‌లోని మాదాక ద్రవ్యాల ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు కొందరు టిడిపి నేతలతో కలిసి వచ్చి పట్టాభి మీడియా ముందు హల్చల్ చేశారు. డ్రగ్ టెస్ట్‌కు రాకుండా వైసీపీ నేతలు తోక ముడిచారని, డ్రగ్స్ టెస్ట్‌కు తాము సిద్ధమని, ఎప్పుడు పిలిచిన వస్తామని పట్టాభి మాట్లాడారు. అంటే తెలంగాణలో రేవంత్, కేటిఆర్‌ల మాదిరిగా తాను హైలైట్ అవ్వాలని, అలాగే వైసీపీని ఇరికించాలని పట్టాభి ఇలా డ్రగ్స్‌పై రచ్చ చేసినట్లు కనిపిస్తోంది.