నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈడీ బుధవారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సమసన్లు పంపించింది. అయితే సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి స్పందించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలను భయపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీలను కీలుబొమ్మల్లా ఉపయోగించుకుంటుందన్నారు. ఫేక్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ కేసులపై న్యాయపరంగా పోరాడుతామన్నారు. 2015లో ఈ కేసును ఈడీ మూసివేసిందన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. మూసివేసిన కేసులను రీఓపెన్ చేయడంలో ఏదో మతలబ్ దాగి ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని అభిషేక్ సింఘ్వి ఆరోపించారు.