తెలంగాణ రాష్ట్ర సమితిని..భారత రాష్ట్ర సమితిగా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణ చేస్తున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి తోట చంద్రశేఖర్‌ని అధ్యక్షుడుగా పెట్టారు. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు.
ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ వేడుకని ఖమ్మం జిల్లాలో నిర్వహించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మందిని సభకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. ఖమ్మంలో సభ పెట్టడం ద్వారా..అటు పక్కనే ఉండి ఏపీ ప్రజలు కూడా భారీ ఎత్తున వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే 18వ తేదీన జరగనున్న సభపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈ సభకు నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర కీలక జాతీయ నేతలు హాజరు కానున్నారు. . రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయ్ విజయన్ లతో పాటు దేశంలోని కీలక నేతలు ఈ సభకు హాజరయ్యేలా ప్లాన్ చేశారు. ఈ సభ ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి రాష్ట్రానికి కేసీఆర్ మరింత గౌరవం పెంచుతారని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఈ సభలో పసందైన వంటకాలు కూడా అతిథుల కోసం చేయిస్తున్నారు. జాతీయ నాయకులకు తెలంగాణ రుచులతో శాఖాహారం, మాంసాహారంతో పసందైన విందును వడ్డించనున్నారు. నాటుకోడి, బొమ్మిడాయిల పులుసు, కొర్రమేను కూర, రొయ్యల ఫ్రై.. వంటి మొత్తం 63 రకాల వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు.
మొత్తానికి బీఆర్ఎస్ ఆవిర్భావ సభని భారీ స్థాయిలో సక్సెస్ చేసేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. దేశం మొత్తం ఈ సభ వైపు చూసేలా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా దేశ రాజకీయాల్లోనే కాదు..రాష్ట్ర రాజకీయాల్లో కూడా కారు పార్టీ తమ బలాన్ని చాటేలా ముందుకెళ్లనుంది.