ఎడిట్ నోట్: హస్తం హామీలు..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఆరు నెలలకు ముందే అన్నీ ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించడం మొదలుపెట్టాయి. ఇప్పటికే కే‌సి‌ఆర్..రాష్ట్రంలో తిరుగుతున్నారు..అటు కే‌టి‌ఆర్ అభివృద్ధి పనుల పేరుతో ప్రజల్లో ఉంటున్నారు. ఇక బి‌జే‌పి సైతం కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై పోరాడుతూనే..ప్రజా మద్ధతు పెంచుకునే పనిలో ఉంది. ఇక కేంద్రం పెద్దలని కూడా రప్పిస్తూ..తెలంగాణపై ఇంకా పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఆ రెండు పార్టీలు దూకుడుగా ఉండటంతో కాంగ్రెస్ కూడా రేసులోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది..అంతర్గత సమస్యలు ఉన్నా సరే..వాటిని పక్కన పెట్టి..పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణకు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు. చాలా రోజుల నుంచి ప్రియాంక తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ డైరక్ట్ గా ఆమె రంగంలో దిగలేదు. తాజాగా నేరుగా రంగంలోకి దిగారు. ఇక తెలంగాణలో ప్రధానమైన యువత ఓటు బ్యాంకుని టార్గెట్ చేశారు. తెలంగాణ వచ్చాక పెద్దగా న్యాయం జరగని వర్గం ఏదైనా ఉందంటే..అది యువత మాత్రమే..అనుకున్న మేర ఉద్యోగాలు వారికి దక్కలేదు.

ఈ క్రమంలో యువతలో అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. ఇటు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇంతవరకు కే‌సి‌ఆర్ హామీ నెరవేర్చలేదు. దీంతో వారికి కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం పోరాడిన వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రియాంక గాంధీ చేత టి‌పి‌సి‌సి హామీ ఇప్పించారు. అలాగే తెలంగాణ సమరయోధులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేస్తామని, నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రియాంక ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఇక జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి, సెప్టెంబరులో నియామక పత్రాలు అందజేస్తామని, ప్రైవేటు కంపెనీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు వడ్డీలేని 10 లక్షల రూపాయల రుణాన్ని ఇస్తామని భారీ హామీ ప్రకటించారు. మరి ఈ హామీలు కాంగ్రెస్ పార్టీకి యువత మద్ధతు పెరిగేలా చేస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news