విభిన్న వాతావరణం ఒకటి నెలకొని ఉన్నప్పుడు తెలివి ఒక్కటే ప్రథమ పరిష్కారానికి ఉపయోగపడుతుంది లేదా ఉపయుక్తం అవుతుంది. సందిగ్ధతలను దాటుకుని ప్రయాణించాలన్న తలంపుతో ఉన్నప్పుడు కొత్త మార్గం ఒకటి కావాలంటే కాస్త సాహసం మరి కాస్త చొరవ ఉండాలి. ఉండాలి కాదు ఉంటేనే సాధ్యం. ఇప్పుడు పరాజితులుగా ఉన్న మంత్రులకు ఇవే మాటలు ఒకటికి, రెండు సార్లు చెప్పాలి. లేదంటే కొన్ని విపత్కర పరిణామాలు అన్నవి తలెత్తక మానవు. మంత్రి వర్గ విస్తరణలో లేదా పునర్వ్యవస్థీకరణలో చోటు చేసుకునే పరిణామాలు ఇప్పుడు మరింత కీలకం కానున్నాయి. తాజా మాజీలు జిల్లాలకు వెళ్లి పార్టీకి సేవలు చేయాలి. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న ఆదేశాలు.
ముఖ్యంగా పునర్వ్యస్థీకరణలో భాగంగా చాలా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు జగన్. జిల్లాలలో పార్టీ పరిస్థితి బాలేని చోట సీనియర్లను పంపి వాళ్లతో పనిచేయించాలని చూస్తున్నారు. అసలు ఇప్పుడు మంత్రులుగా పదవులు పోయినవారందరికీ తలకు మించిన భారం పడనుంది. అందుకే చాలా మంది మాజీలుగా అయ్యాక పూర్తిగా పార్టీకి దూరం అయిపోయి వేరే పార్టీలోకి వెళ్లిపోతే బెటర్ అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం జిల్లాలలో పనిచేసి క్షేత్ర స్థాయిలో మండుటెండలను సైతం లెక్క చేయక తిరుగాడి పార్టీని ఓ గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇప్పటి తాజా మాజీలదే. సీఎం ఉద్దేశం బాగున్నా కూడా ఆ మేరకు ఫలితాలు రావడం చాలా కష్టం.
అప్పటిదాకా మంత్రులుగా ఉన్నవారు ఒక్కసారి హోదా కోల్పోయి సాధారణ స్థాయిలో పనిచేయాలంటే జరగని పని. ఎందుకంటే మంత్రి అంటే హోదా ఉంటుంది. ఓ విధంగా ఆర్భాటం ఉంటుంది. సచివాలయంలో మాట చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు అవేవీ లేకుండా సామాన్య వ్యక్తుల్లా తిరుగాడి పార్టీకోసమే అంకితమై పనిచేయాలంటే కష్టమే! ఒకవేళ అలా పనిచేసినా కూడా ఫలితాలు
వస్తాయా? వస్తాయి కానీ అందుకు చాలా శ్రమించాలి.
ఇప్పటిదాకా ఉన్న వారందరూ తమ పదవులు ఉన్నప్పుడే క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు అన్న విమర్శలు మోస్తున్నారు. అందుకే వారని తప్పించి కొత్త వారిని తీసుకుంటున్నారని కూడా టాక్ ఉంది. కోవిడ్ కారణంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యం అయింది. ముందుగా నిర్ణయించిన సమయం కన్నా ఆర్నెల్లు ఆలస్యం అయింది. దీనిని తాము గ్రేస్ పీరియడ్ గా భావిస్తున్నామని మంత్రులు అంటున్నారు. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో అవమాన భారంతో ప్రత్యర్థుల నుంచి తిట్లను భరిస్తూ పని చేయడం కష్టం. అందుకే తాజా మాజీ లు చాలా మంది ప్రత్యర్థి పార్టీలలో చేరిపోవడం ఖాయం.