అన్నింటా మంచి
అన్నింటా కొంతే మంచి
ప్రజలకు మంచి కాదు
పాలకులకు మంచి
పాలకుల మంచి అనగా
వాళ్ల అరుపులకూ కేకలకూ
వేదిక పరంగా పార్లమెంట్ సమావేశ
సమయం మంచి ..మనకు చెడు
మంచి చెడుల కలయికలో బడ్జెట్ సమావేశాలు
ష్ ! గప్ చుప్ ఏమీ అనకుండ్రి! గమ్మునుండవో!
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రాజకీయ రచ్చ నడవనుంది కనుక మనం వాటిపై ఏమీ మాట్లాడక మౌనంగానే ఉంటూ వాటిని వీక్షిస్తూ, వింటూ పోవాలి. మోడీ ఎప్పటిలానే తానేం చెప్పినా చెప్పకున్నా కూడా వివాదాలకు మాత్రం తావు లేకుండా అధికార పార్టీ నడవడి ఉండదని గత కొన్ని సమావేశాల్లో ఆధార సహితంగా తేలిపోయింది. కనుక మనం ఇప్పుడు ఆ రెండు వర్గాల కొట్లాటపై పంచాయతీ తీర్పులేమీ ఇవ్వవొద్దు కానీ చట్ట సభల్లో సభ్యుల తీరు ఇంతే అని సర్దుకుపోదాం.
అంతేకాదు మళ్లీ మళ్లీ పదే పదే ప్రజాధనం వృథా అవుతుందని గోల చేయవద్దు ఎందుకంటే ఆ పని వాళ్లకు మాత్రం చేతనవును కనుక చేస్తున్నారు.. వాళ్లకు ఇంగితం లేదని ఎన్ని సార్లు నిరూపణ అయినా నడవడిలో మార్పు కోరుకోవడం అంటే అదొక కొలిక్కి రాని విషయమే కాదు కాదు కొరుకుడు పడని విషయమే! అందుకే ప్రియమయిన భారతీయుడా ఛాయ్ తాగి బిస్కెట్ తిని ఈ డిస్కషన్ ను ఇంతటితో వదిలేయడమే నీకు మనశ్శాంతి కారకం.
యే స్పై వేర్ కా కహానీ.. అవును! ఇప్పుడు పార్లమెంట్ సభ్యులకు మెంటల్ తెప్పించనుంది. కేంద్రానికి మెంటార్ షిప్ చేస్తున్నది ఎవరు? ఎంటర్ ప్రెన్యూర్ షిప్ చేస్తున్నది ఎవరు? కేంద్రంతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నది ఎవరు? అన్నవిప్పుడు తేలడం లేదు.దీంతో విపక్ష సభ్యులు ఇవాళ పార్లమెంట్ ను రేపు పార్లమెంట్ ను ఒక విధంగా దద్దరిల్లింపజేయవచ్చు.బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అదే అదునుగా విపక్ష పార్టీల సభ్యులంతా మోడీపై ఫైర్ అవ్వొచ్చు.కోపంతోనూ మరియు ఆవేశంతోనూ ఊగిపోవచ్చు.
ఆ విధంగా కొత్త యుద్ధం ఒకటి మళ్లీ మొదలు కావొచ్చు.లేదా పాత కోపాలకు కొనసాగింపే ఇప్పటి బడ్జెట్ సమావేశాలు కావొచ్చు. ఏదేమయినా కావొచ్చు ఆ రోజు ఇజ్రాయిల్ తో ఏం ఒప్పందాలు చేసుకున్నారు. పెగాసస్ అనే స్పై వేర్ (సాఫ్ట్ వేర్) ను ఎందుకు కొనుగోలు చేశారు.గూఢచర్యం పేరిట కేంద్రం ఆడుతున్న నాటకం ఏంటి ? అన్నవి ఇప్పుడు కాంగ్రెస్ సంధిస్తున్న మరియు సంధించబోతున్న ప్రశ్నాస్త్రాలు.వీటిపై మోడీ మాట్లాడతారో లేదో లేకా సభ నుంచి తానే తప్పుకుని వెళ్లిపోతారా అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
2017లో కేంద్రం కొనుగోలు చేసిన స్పై వేర్ ఇప్పుడు వివాదాలను రేపుతుండడం, వాటిపై కాంగ్రెస్ తో ఇతర సభ్యులు మండిపడుతుండడం ఓ విధంగా పార్లమెంట్ ను ప్రతిష్టంభనకు గురిచేసేందుకు సరైన కారణమే! వీటిపై కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలే అని కాంగ్రెస్ అంటుంటే లేదు లేదు మేం అన్నీ నిజాలే చెప్పాం కానీ మీరే సరిగా వినిపించుకోవడం లేదు అని కేంద్రం తన తరఫు వాదన ఒకటి బలీయంగా వినిపిస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం విరామం అంటూ లేకుండా నడవనుంది. ఈ సందర్భంలో అర్థవంతం అయిన చర్చను సభాపతి కోరుకోవడం ఓ అత్యాశ. అందుకు తగ్గ విధంగా సభ్యుల ప్రవర్తన ఉంటుందని అనుకోవడం కూడా అత్యాశే!
– ఎడిట్ నోట్ – మన లోకం ప్రత్యేకం