ఎడిట్ నోట్: మేనిఫెస్టో ‘మాయ’..!

-

ఏపీలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనే పరిస్తితి నెలకొంది. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహా-ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఈ సారి  ముందస్తు ఎన్నికలు జరుగుతాయో..లేక షెడ్యూల్ ప్రకారం..2024లోనే ఎన్నికలు జరుగుతాయో తెలియదు గాని..ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నట్లుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. ఎవరికి వారు ప్రజలని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రజలకు కీలక హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే జగన్..మళ్ళీ తాను అధికారంలోకి వస్తేనే ఇప్పుడు అందే సంక్షేమం అందుతుందని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు వస్తే ఇప్పుడుచ్చే పథకాలని రద్దు చేస్తారని అంటున్నారు. అంటే తాను చేసే సంక్షేమంపై జగన్ ఆధారపడ్డారు. ఇక ప్రజలు సంక్షేమ పథకాలపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో చంద్రబాబు సైతం సంక్షేమ వరాలు ఇవ్వక తప్పలేదు. ఊహించని విధంగా ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే..ప్రజలపై సంక్షేమ వరాల జల్లు కురిపించారు. ఎన్నికలు ఎప్పుడో జరుగుతాయో..జగన్ ఎప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుకెళ్తారో తెలియదు..అందుకే బాబు ముందస్తు ఆలోచనతోనే మేనిఫెస్టో కూడా తయారు చేసేస్తున్నారు.

తాజాగా మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోని ప్రకటించారు. మహిళలకు భారీ వరాలు ఇచ్చారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చారు..రైతులకు పెద్ద పీఠ వేసేలా మేనిఫెస్టో రూపోదించారు. బాబు ఇచ్చిన హామీలని చూస్తే..60 ఏళ్ళు పైబడిన వారికి, వితంతవులకు ఎలాగో పెన్షన్ ఉంటుంది..అందుకే 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నవారికి నెలకు రూ.1500..తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే..అంతమందికి ఏడాదికి రూ.15 వేలు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్ళిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఎంతమంది సంతానం ఉన్న స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కు.

యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు..20 లక్షల ఉద్యోగాలు..రైతులకు ఏటా రూ.20 వేలు..ఇవి బాబు ఇచ్చిన హామీలు..ఇవన్నీ బూటకమని వైసీపీ అంటుంది. గతంలో హామీలు ఇచ్చి..ఏది అమలు చేయలేదని, బాబు మాటలు నమ్మవద్దని అంటున్నారు. అంతా మాయ అంటున్నారు. చూడాలి మరి ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version