రేపు తెలుగు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీలో సంక్రాంతి రికార్డు బ్రేక్ అయింది. సంక్రాంతి కన్నా 10 శాతం అదనంగా ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు వినియోగించుకున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ఏపీకి 59,800 మంది ప్రయాణించినట్లు తెలిపారు. ఇవాళ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగింది అని ఆర్టీసీ ఎండి తెలిపారు. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని ,టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం https://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.