ఆంధ్రావని రాజకీయాల్లో ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న మాట పీఆర్సీ.కొత్త పీఆర్సీ వద్దు పాత జీతం ముద్దు అని ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్న వైనం తెలిసిందే.వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉద్యమించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.ముఖ్యంగా పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓలు ఉపసంహరించుకునే వరకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలనే సంకల్పించాయి.
అటుపై సమ్మెకు పిలుపునిచ్చి ఉద్యమం ఉద్ధృతిని పెంచనున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా మంత్రులు మాత్రం తాము చెప్పాలనుకు న్నదేదో చెబుతూనే ఉన్నారు.శాంతియుతంగా పరిష్కరించాల్సిన సమస్యలను జఠిలం చేయవద్దని, భాష జాగ్రత్తగా వాడాలని ఆయా సందర్భాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను సంబంధిత నాయకులే నియంత్రించాలని కూడా బొత్స లాంటి వారు చెబుతున్న సూచన.
ఉద్యమం అంటూ రోడ్డెక్కా ఈ తరుణంలో చర్చకు వెళ్లాలా వద్దా అన్న ఆలోచన కూడా కొందరు ఉద్యోగుల్లో ఉంది.ఏకపక్షంగా పోతే మొదటికే మోసం వస్తుందన్న మాట కూడా ఉద్యోగ సంఘాల నుంచి వర్గాల నుంచి వినిపిస్తున్న మరో వాదన. అందుకే సమస్య పరిష్కరించేందుకు ఫైవ్ మెన్ కమిటీని కలిసి మాట్లాడలా వద్దా అన్న సంశయం ఉన్నా కూడా కొందరు మాత్రం చర్చలకు సై అంటూనే ఉన్నారు.గొడవ పెద్దది చేసుకున్నా వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది కనుక మధ్యేమార్గంగా చర్చలకు వెళ్లేందుకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సమాలోచనలు చేస్తున్నాయని తెలుస్తోంది.మాట్లాడుకుంటే పోయేవే కదా ఇవన్నీ వీటిపై ఉద్యమాలు ఎందుకు జనం దగ్గర చులకన అయిపోయి తరువాత బాధపడడం అని కూడా పేర్నినాని లాంటి వారు పదేపదే చెబుతూ వస్తున్నారు.ఆ మాట ఈ మాట అనుకుని ఎవ్వరూ సజావుగా సాధించేదేమీ ఉండదు కనుక చర్చలకు పోతేనే ఇరు వర్గాలకూ మేలు.