జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరణించారు. 12 గంటల వ్యవధిలో ఈ రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. కాశ్మీర్‌లోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో లష్కరే తోయిబా మరియు జైషే మహ్మద్‌లకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని పోలీసులు తెలిపారు. అత్యంత కీలక ఉగ్రవాది జైషే మహ్మద్ అగ్ర కమాండర్ జాహిద్ వనీ ఈ ఎన్‌కౌంటర్లలో హతమయ్యాడని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. ఇది భద్రతా బలగాలకు చాలా పెద్ద విజయమని అభిప్రాయపడ్డారు.
పుల్వామాలో శనివారం సాయంత్రం నైరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో జైష్-ఎ-మహ్మద్‌కు అనుబంధంగా ఉన్న నలుగురు ఉగ్రవాదులు ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు. బుద్గామ్ జిల్లాలోని చరర్-ఇ-షరీఫ్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ఒక ఉగ్రవాదిని అంతమొందించారు.