హెడ్‌లైన్ చూడగానే మీకు మైండ్ బ్లాక్ అయిఉంటుంది.. జుట్టుకు ఇంజిన్‌ఆయిల్ ఏంట్రా..పిచ్చి బాగా ముదిరిపోయిందా అనుకుంటున్నారా..? వంటకు ఉపయోగించే వంటనూనెను కూడా తలకు ఉపయోగించే వారు కొంతమంది ఉంటారు. అయితే మీరెపుడైనా వాహనాలలో ఉపయోగించే ఇంజన్ ఆయిల్‌ను జుట్టుకు వర్తించడం గురించి ఆలోచించారా? ఒకవేళ తలకు ఇంజన్ ఆయిల్ రాస్తే ఏమవుతుంది? ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? కానీ జుట్టు పెరుగుదల కోసం ఇలాంటి ప్రయోగాలు చేసే వారు కూడా ఉన్నారట.
హెయిర్ ఆయిల్‌లో ఇంజన్ ఆయిల్‌ను మిక్స్ చేసి వాడకం గురించి ఇంటర్నెట్లో చాలా మంది సెర్చ్ చేస్తున్నారట..కొన్ని రకాల షాంపూలు, డిటెర్జెంట్ల తయారీలో వాడే కొన్ని పదార్థాలు ఇంజన్ ఆయిల్‌లోనూ ఉన్నాయట.. నూనె ఏదైనా నూనే కదా అనేది కొంతమంది అనుకుంటున్నారు..అంతేకాకుండా, ఇంజన్ ఆయిల్ మరింత చిక్కగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటుంది, దీనివల్ల ఇది నల్లని, ఒత్తైన కురులకు సహాయపడుతుందని నమ్ముతున్నారు..జుట్టుకు సంబంధించి చికిత్సలు చేసే ట్రైకాలజిస్టులను ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తినవారు ఉన్నారని కొన్ని నివేదికలు తెలిపాయి.
నిపుణులు ఏం అంటున్నారు..?
మోటారు ఆయిల్ లేదా ఇంజన్ ఆయిల్‌ను తలకు రాసుకోవడం వలన జుట్టు పెరుగుతుంది అని చెప్పటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జుట్టుకు ఇంజన్ ఆయిల్ మంచిది అనే వాదనను నమ్మాల్సిన అవసరం లేదు. పైగా, ఇది మీజుట్టును నాశనం చేస్తుంది అని నిపుణులు అంటున్నారు.. ఇంజన్ ఆయిల్స్ అనేవి డిటర్జెంట్లు, యాంటీ-ఫోమింగ్ ఏజెంట్లు, యాంటీ-వేర్ ఏజెంట్లు తదితర రసాయన సంకలితాలతో నిండి ఉంటుంది. ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, మీ జుట్టును మరింత ముతకగా, పెళుసుగా మారేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు..
ఇలాంటి హానికరమైన ఏజెంట్లను మీ జుట్టు లేదా చర్మం నుంచి శుభ్రపరుచుకోవడానికి షాంపూను ఎక్కువగా వాడాల్సి ఉంటుంది.. సబ్బుతో కడిగినా వాటి మురికి వదలదని చెబుతున్నారు. జుట్టు పెరుగుదల, ఇతర జుట్టు సమస్యల గురించి అంతగా ఆందోళన చెందేవారు ప్రొఫెషనల్‌ను సంప్రదించాలి. వారు మీ జుట్టు రకాన్ని పరీక్ష చేసి ఏ నూనె వాడితే మంచిదో సూచిస్తారు అని నిపుణులు పేర్కొన్నారు