రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. భారతదేశ అభివృద్ధిపై చర్చించేందుకు ఉద్దేశించిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్‌ను అంతర్జాతీయ సలహా సంస్థ ఈపీజీ ఆహ్వానించింది. మే 11, 12 తేదీల్లో లండన్ వేదికగా జరగనున్న ఈ సదస్సులో పాల్గొని, ప్రసంగించాలని కోరింది. యూకే, యూరోప్, భారతదేశ పరిశ్రమలు, విధానకర్తలు, వ్యాపారవేత్తలను ఒకే వేదికపై తీసుకువచ్చేలా ఈ కార్యక్రమం జరుగుతోంది.
‘‘మీరు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఈ చర్చలు మరింత విలువను సంతరించుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం’’ అని ఆహ్వానపత్రంలో ఈపీజీ సంస్థ పేర్కొంది. యూకే పార్లమెంటు దిగువసభ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో అక్కడి కార్మికశాఖ మంత్రి సీమా మల్హోత్రా ఇచ్చే విందుకు, యూకే కేబినెట్ మంత్రితో కలిసి ప్రధానవక్తగా బ్లాక్ టై సెలబ్రేషన్ విందుకు కేటీఆర్ హాజరుకానున్నారు. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో 800 మందికిపైగా వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొంటారు.