ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ఎర్రబెల్లి దయాకర్, రేవంత్ రెడ్డి…ఇప్పుడు వేరు వేరు పార్టీల్లోకి వెళ్ళి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎర్రబెల్లి బిఆర్‌ఎస్‌లోకి వెళ్ళి కీలక నేతగా ఉన్నారు..అలాగే మంత్రిగా పనిచేస్తున్నారు. అటు రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళి టిపిసిసి అధ్యక్షుడు అయ్యారు.
అయితే తాజాగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహించే పాలకుర్తిలో జనసభ నిర్వహించి..ఎర్రబెల్లిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎర్రబెల్లి దయాకర్ రావు ఓనమాలు, ఏబిసిడిలు రాస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పౌరుషం గల ఈ గడ్డమీద పలక బలపం ఇస్తే ఓనమాలు రాయనోడు ఎమ్మెల్యే కావడం విచారకరమని, ఎర్రబెల్లికి చదువు రాదని రేవంత్ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు ఆయనకు విప్‌గా అవకాశం ఇస్తే విస్మరించి కేసిఆర్ రాచరిక పాలన కోసం పావుగా పనిచేశారని, అందుకే ఈరోజు మంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీని ముంచిన దుర్మార్గుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అని, చంద్రబాబు చదువు రాని ఎర్రబెల్లికి చాలా ప్రాధాన్యతనిస్తే ఎర్రబెల్లి కోవర్టులా మారి పార్టీకి తీరని నష్టం చేశారని రేవంత్ గుర్తు చేశారు. పాలకుర్తిలో అక్రమాలకు పాల్పడుతున్నారని, భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇక రేవంత్ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి..చంద్రబాబు ఏజెంట్ అని, రేవంత్ ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, రేవంత్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తే తాను చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇప్పించానని చెప్పుకొచ్చారు. తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అటు షర్మిలపై కూడా ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. షర్మిల పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలని అన్నారు.