సీఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసిఆర్ కుట్రలకు కేరాఫ్ అడ్రెస్ అని..ఫామ్ హౌస్ లో కూర్చొని భూముల లెక్కలు తీసి..తన మీద కుట్ర చేసే ప్రయత్నం చేశాడని ఆరోపణలు చేశారు. సంపూర్ణమైన మెజారిటీ ఉండగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని మంత్రిని చేసిన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నడూ లేని పద్దతిలో అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎం కెసిఆర్ కు ప్రేమ పుట్టుకు వస్తుందని… పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని కోరానని…అనేక సార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. తాను ఆ శాఖ నుంచి బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు వైద్య శాఖపై ప్రేమ ఒలకబోస్తూన్నారని మండిపడ్డారు.
దళితుడే మొదటి ముఖ్యమంత్రి పదవి అన్న కెసిఆర్ మాట తప్పేది లేదన్నారని… మాట తప్పితే తల నరుక్కుంట అన్నారని ఈటల గుర్తు చేశారు. దళితులకు ముఖ్యమంత్రి.. అన్న మాట పక్కకు పెడితే ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని చురకలు అంటించారు. దళితులు పాలించేందుకు అర్హులు కాదని అవమానించారన్నారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల పరిస్థితే ఇప్పుడు పునరావృతం అవుతుందని… అప్పుడు తెలంగాణ రాష్ట్ర కోసం ఉప ఎన్నిక జరిగితే ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎన్నిక జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా బిజెపిదే విజయమని స్పష్టం చేశారు.