పోడుభూముల ఘర్షణలో తీవ్ర గాయాలనై ఫారెస్ట రేంజర్ శ్రీనివాస రావు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు. జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రగూడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు అధికారులు నాటిని మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. గతంలో ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
దీంతో.. లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.