సీఎం జగన్ అధ్యక్షతన మంత్రులు, పార్టీ అధ్యక్షులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా కష్టపడి పనిచేయాలని వైసీపీ టార్గెట్ అని ఆయన వెల్లడించారు. వచ్చే నెల నుంచి సచివాలయాలను ఎమ్మెల్యేలు తప్పక సందర్శించాలని సీఎం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని.. కానీ.. ముందస్తుకు పోయే ప్రసక్తే లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం త్వరలో జిల్లాల పర్యటనలకు వస్తారు. విభేదాలు, సమస్యలను వెంటనే పరిష్కరించాలని రీజినల్ కో-ఆర్డినేటర్లను ఆదేశించారన్నారు.
విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నట్లు, 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలిందన్నారు. సర్వేల్లో కొంత మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందని, కొందరు ఎమ్మెల్యేల గ్రాప్ 40 నుంచి 50 శాతం మాత్రమే ఉందన్నారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం దిశానిర్దేశాలు చేశారన్నారు.