తెలంగాణ రాజకీయాల్లో గద్వాల్ బిడ్డ డీకే అరుణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పనిచేస్తున్న డీకే అరుణకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది. తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అరుణ..రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అలాగే ఇప్పుడు తన తనయురాలు స్నిగ్ధారెడ్డిని సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి సక్సెస్ చేయాలని అరుణ ట్రై చేస్తున్నారు.
అసలు అరుణ..పుట్టినిల్లు గాని, మెట్టినిల్లు గాని రాజకీయాల్లో ఉన్నవారే. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, సోదరులు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో రాజకీయం చేసినవారే. ఇటు అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి, మామ డీకే సత్యారెడ్డి, బావ డీకే సమరసింహారెడ్డి…ఇలా అందరూ రాజకీయాల్లో పనిచేసినవారే. ఇక వారి సపోర్ట్ తో అరుణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి…1996లో టీడీపీ తరుపున మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998లో అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.
ఇక 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గద్వాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా వరుసగా ఓడిపోయిన అరుణ…2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గద్వాల్ లో గెలిచారు. అలాగే మధ్యలో మంత్రిగా పనిచేశారు. అయితే 2018లో ఓటమి పాలయ్యాక అరుణ కాంగ్రెస్ పార్టీని వదిలి…బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బీజేపీలో కీలక నాయకురాలుగా పనిచేస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో తన వారసురాలు స్నిగ్ధారెడ్డిని గద్వాల్ బరిలో దించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను వేరే సీటు చూసుకుని, కుమార్తెని గద్వాల్ బరిలో దింపాలని అరుణ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అటు స్నిగ్ధా కూడా ఎప్పటినుంచో గద్వాల్ లో రాజకీయం నడుపుతున్నారు. మొత్తానికి అరుణ…తన వారసురాలుని రెడీ చేశారు. మరి నెక్స్ట్ పోటీకి దింపి…గెలిపించుకుంటారో లేదో చూడాలి.