తెలంగాణ వాకిట అసలు పబ్బులెందుకు మూయించండి అని అంటోంది టీపీసీసీ. వీలుంటే భౌతిక దాడులకు కూడా సిద్ధం కావాలని అంటోంది టీ పీసీసీ. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ (తెలంగాణ విభాగం) రేవంత్ రెడ్డి రానున్న కాలంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఒకటి షురూ చేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు డ్రగ్ ఫ్రీ హైద్రాబాద్ కూడా సాధ్యమే! ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంకు ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా నియమిత వేళలు దాటాక కూడా నడుస్తున్న పబ్బులపై కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు దాడులు చేశారు.
ఈ ఘటనలు మరిచిపోయేలోగానే మరికొన్ని ఈ తరహా దాడులే చేయాలని టీపీసీసీ ఆలోచిస్తోంది. ఎలానూ దీనిని మొదలుపెట్టాం కనుక ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా కొన్ని సమావేశాలు నిర్వహించి, అటుపై పబ్బులను క్లోజ్ చేయించేందుకు ఓ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలని టీపీసీసీ భావిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపై చర్యలు తీసుకునేంత వరకూ పట్టు విడువక పోరాటం చేయాలని భావిస్తున్నారు రేవంత్ ! అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఎంఐఎం ఎమ్మెల్యే బిడ్డలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నందున ఈ కేసులో రాజకీయ జోక్యం ను నిలువరించేందుకు రేవంత్ తన వంతు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయనున్నారు అని కూడా తెలుస్తోంది.
అదేవిధంగా పబ్ కల్చర్ ను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ తన తరఫున ఓ ప్రజా పోరాటం చేసేందుకు ఐక్య వేదిక ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని ఓ వాదన ప్రజా సంఘాల తరఫున వినిపిస్తోంది. ప్రజల మేలు కోరే శక్తులు సంఘటితం అయితేనే మంచి ఫలితాలు వస్తాయని, డ్రగ్ ఫ్రీ, పబ్ ఫ్రీ హైద్రాబాద్ కోసం అంతా కృషి చేయాలన్న వాదన ఒకటి మరింత బలీయంగా ఉంది.