మన దేశంలో గత కొన్ని రోజులుగా… పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ధరలు పెరగడం గమనార్హం. అయితే తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి చమురు సంస్థలు.
సబ్సిడీ మరియు సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా 15 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి చమురు సంస్థలు. పెంచిన ధరను ఇవాల్టి నుంచి అమలు చేస్తున్నట్లు కుండబద్ధలు కొట్టారు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 899.50 కు చేరింది. అలాగే ఐదు కిలోల సిలిండర్ కొత్త ధర 502 రూపాయలకు పెరిగింది.
కాగా గత రెండు నెలల వ్యవధిలో సిలిండర్ ధరను పెంచడం ఇది నాలుగో సారి. అంతేకాదు ఈ 2021 సంవత్సరం లో గ్యాస్ సిలిండర్ ధర పై మోడీ సర్కారు రూ. 205 పెంచడం గమనార్హం. ఇక అటు ఇవాళ కూడా డీజిల్ మరియు పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది.