సంచలనంగా మారిన నాగరాజు హత్య పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై స్పందించారు. మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యకు గురవడం పైన పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు.
రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు.. పోతిరెడ్డి పల్లి కి చెందిన యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్ సుల్తానా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా లోని ఆర్య సమజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత బాల్నగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పెళ్ళికి మునుపు వికారాబాద్ పోలీసులను.. పెళ్లి తర్వాత బాల్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్ పై సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ వైపు వెళుతున్న ఈ సమయంలో బైక్ వచ్చిన దుండగులు బైక్ ఆపి యువకుడి హెల్మెట్ ని తీయించి దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపుమడుగులో అక్కడికక్కడే కూలిపోయాడు. ఇక ఈ పరువు హత్య సంచలనంగా మారడంతో.. ఇప్పుడు గవర్నర్ సైతం ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.