పవన్ కల్యాణ్ ఓ వైపు, చిరు మరో వైపు ఉన్నారు. పవన్ జగన్ పై పోరాటం చేస్తున్నారు. చిరు రాజకీయాలకు దూరంగా వీలున్నంత మేరకు సామరస్య పూర్వక ధోరణిలో వెళ్తున్నారు. దీంతో ఇరువురి దారి చెరో వైపుగా ఉంది. అయినా కూడా సినిమా పరిశ్రమ బాగుంటే అంతా బాగుంటామన్న వాదనతో ఇద్దరూ ఏకీభవించి ఉన్నారు. కానీ అభిమానులు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
జగన్ ను జనసేన టార్గెట్ చేస్తోంది. రాజకీయంగా ప్రత్యర్థిగానే చూస్తూ ప్రజా పోరాటాలు చేస్తోంది. కానీ జగన్ ను చిరు ఆవిధంగా దూరం పెట్టలేరు. ఆయన తరఫున ఇండస్ట్రీ మనిషిగా ప్రభుత్వ పెద్దలను ఒప్పించే పనిలోనే ఉంటారు. ఉన్నారు కూడా! దాంతో అక్కడ ఇరు వర్గాలకూ మధ్య భేదం కాస్త కనిపిస్తోంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఎవరికి ఏం కావాలన్నా ఆ ఇద్దరు అన్నదమ్ములూ చేస్తారని ఇదివరకే రుజువు అయిందని అంటున్నారు మెగాభిమానులు. రాజకీయంగా దృక్పథాల మాట అటుంచి ఆలోచిస్తే గతంలోనూ ఇప్పుడు కూడా పవన్ కు కానీ చిరు కు కానీ అటువంటి ఇగోలు ఏమీ లేవు.
ఇక ఇవాళ వచ్చిన వార్త అనుసారం ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలకు చిరు చెంతకు జగన్ వెళ్తారు. అవును! ఇది నిజమే.. విజయవాడ కేంద్రంగా జరిగే వేడుకలకు ఈ నెల 23 వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. సిద్ధార్థ్ కాలేజ్ ప్రాంగణాన జరిగే వేడుకలకు జగన్ అతిథిగా రానున్నారు.ఇదే ఇప్పుడు పొలిటికల్ గానూ హాట్ టాపిక్ అయింది. పవన్ సిద్ధాంత పరంగా విభేదిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇదే సమయంలో చిరును దగ్గర చేసుకుని జగన్ తన పని తాను చేసుకుని వెళ్తున్నారు. భిన్న వాదాలు వినపడుతున్న సమయంలో మెగాభిమానులు మాత్రం ఎటు వైపు ఉంటారో లేదా ఉండాలో అన్నది ఓ పెద్ద సంశయంగానే ఉంది. ప్రస్తుతానికి రాజకీయంగా వైరుధ్యాలు ఎన్ని ఉన్నా అన్నయ్య మాటను పవన్ జవదాటరు. కనుక తాము అనుకున్న విధంగానే అభిమానులు కూడా ఉండాలని కోరుకుంటున్నారు.
రాజకీయంగా దృక్పథాలు ఎలా ఉన్నా ఎవరి అభిప్రాయం ప్రజలకు మేలు చేస్తుందో ఆలోచించి అటువైపే అభిమానులు ఉంటే ఇంకా మేలు. ఆ విధంగా ఉంటే ఎటువంటి తగాదాలకు చోటే లేదు. ఎందుకంటే చిరు అన్నా, పవన్ అన్నా ఒకే విధంగా స్పందించే అభిమానులకు రాజకీయ అభిప్రాయాలు ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా మెగా కుటుంబం మాత్రం ఇండస్ట్రీ ఉన్నతి కోసం, ముఖ్యంగా ఆపదలో ఉన్న ప్రజల కోసం మరింతగా పనిచేస్తూనే ఉంటుందని చిరు సన్నిహితులు చెబుతున్నారు.