త్వరలో జనసేనకు సంబంధించి కొన్ని కీలక మార్పులు జరగనున్నాయి.పవన్ ఈ సారి తన స్ట్రాటజీ మార్చనున్నారు.జగన్ ను ఎలా అయినా సమర్థ రీతిలో ఎదుర్కొని పరువు నిలబెట్టుకోవాలని కూడా యోచిస్తున్నారు.గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకుండా ఉండేందుకు ఆ పునరావృతిని నివారించేందుకు ఈ సారి పవన్ కల్యాణ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చం అని స్పష్టీకరించారు. ఆవిర్భావ సభలో ఆయన చెప్పిన ఈ మాట అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ ప్రకంపనాలు సృష్టిస్తోంది.
ముఖ్యంగా ఎప్పటి నుంచో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముఖ చిత్రం మార్చాలని, కాపులు మరియు ఇతర బీసీల ప్రాధాన్యం రాజకీయంలో పెరగాలని ఓ వాదన అయితే వినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే కొందరు జనసేన పార్టీ వెంట నడవాలని ఉవ్విళ్లూరుతున్నారు కూడా! కాపులకు కేరాఫ్ గా నిలిచే పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకనో తనదైన ప్రాబల్యాన్ని నిరూపించుకోలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం పవన్ ను అసెంబ్లీకి పంపడం, పొత్తులు ఎవరితో అయినా సరే పదవులు తీసుకోవడం ఆ విధంగా మంత్రి వర్గంలో భాగం పంచుకోవడం అన్నవి ఇవాళ్టి జనసేన లక్ష్యాలు. వాటి నెరవేర్పే ఇప్పటి ఆచరణ.
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో హీరో మరియు కమెడియన్ సునీల్ సీన్ లోకి వచ్చారు.ఆయనను వచ్చే ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. కానీ ఇదంతా జరిగే పని కాదని సునీల్ తేలుస్తున్నారు.తనకు మెగాస్టార్ అన్నా పవర్ స్టార్ అన్నా ఎంతో ఇష్టమని అయితే తన ఒంటికి రాజకీయాలు అస్సలు నప్పవు అని అంటున్నారు. నేను రాజకీయాలకు అన్ ఫిట్ అని కూడా అంటున్నారు. కానీ జనసైనికులు మాత్రం భీమవరం నుంచి సునీల్ పోటీ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యంఇస్తున్నారు.