ఒకవైపు స్వేచ్ఛ మరోవైపు సమానత్వం ముస్లింల అస్తిత్వానికి సంబంధించి ఇంకోవైపు వాదన..వాగ్వాదం అన్నీ కలిసి నడుస్తున్న వేళ దేశంలో ఓ అస్తిరతను నెలకొల్పే ప్రయత్నం ఎవ్వరు చేసినా అందుకు బాధ్యులు వారే! దానిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే! అంతా ఒక్కటే అని చెప్పే విద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మలుచుకోవడమే సిసలు వివాదానికి కారణం. ఇంతకూ ఈ వివాదంలో కొత్త మాటలు ఏవి వినిపిస్తున్నాయో ఓ సారి చూద్దాం.
కర్ణాటక కేంద్రంగా రాజుకున్న హిజాబ్ వివాదంపై రోజుకో మాట వినిపిస్తోంది. రోజుకో మలుపు ఈ వివాదం తీసుకుంటోంది. అసలు భారతీయ మహిళలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో వస్త్ర ధారణ చేసుకోవచ్చని అంటున్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
కానీ వీటికి భిన్నంగా ముస్లీం సంఘాలు ఇవాళ స్పందిస్తున్నాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) మాటల ప్రకారం..“హిజాబ్ అన్నది ప్రతి ముస్లిం మహిళకు ఉన్న గుర్తింపు లాంటిది,సమాజంలోని పైశాచిక అంశాల నుంచి ముస్లిం మహిళలను రక్షిస్తుంది” అని అంటోంది.దీని గురించి ఇతరులకు తెలియజేయమని కూడా చెబుతోంది.
మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా స్పందించారు. ఆయనేమన్నారంటే..‘‘ హిజాబ్ అనే పదాన్ని ఖురాన్‌లో ఏడు శ్లోకాలలో లేదా ఏడు సందర్భాలలో ఉపయోగించారు.బురఖా కూడా ఒక రకమైన డ్రెస్.దుస్తులకు ఒక నిర్దిష్ట ఆకృతిని తీసుకువచ్చేందుకు ముస్లిం చట్టం ప్రయత్నించింది.ఇందులో భాగంగానే మహిళలతో ముడిపడి ఉన్న అన్ని రకాల దుస్తులకు హిజాబ్‌ను ఉపయోగించారు.
కానీ ఖురాన్ మాత్రం మహిళల దుస్తుల విషయంలో హిజాబ్ ను ఉపయోగించలేదు.అయితే ఖురాన్ లో ‘ఖిమర్’ (తల కండువా) అనే పదం ప్రస్తావన ఉంది.ఒక వేళ మీరు ‘లిసాన్-ఉల్-అరబ్’ (అరబిక్ నిఘంటువు) చదివి ఉంటే అందులో ‘ఖిమర్’ ను స్కార్ఫ్‌గా, మహిళలు తమ వెంట తీసుకెళ్లే గుడ్డగా నిర్వచించారు ’’ అని అంటున్నారు.