ఆస్తిని అమ్మితే వచ్చే లాభాలపై పన్ను ఎలా మినాయించుకోవచ్చు..?

-

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఆ పరిధిలోకి వచ్చే వాళ్లంతా పన్ను చెల్లించాలి. లేదంటే అదంతా నల్ల ధనం కిందకు వెళ్తుంది. దానివల్ల దొరికిపోతే లేనిపోని లొల్లి. సాధారణంగా స్థలం, ఇల్లు లాంటి ఆస్తులను వాటి కొనుగోలు ధరకన్నా లాభానికి అమ్ముతుంటారు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ప్రాపర్టీని అమ్మడం ద్వారా వచ్చే లాభాలు.. కాలవ్యవధిని బట్టి మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటాయి. మీరు ఒక ఆస్తిని విక్రయించినట్లయితే వచ్చే మూలధన లాభాలపై ఆదాయపన్ను శాఖ విధించే పన్ను భారీగానే ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఒక వ్యక్తి దీర్ఘకాలిక మూలధన లాభాల ద్వారా పన్నును ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తి అమ్మకంపై పన్నును ఎలా నివారించొచ్చు? ఎలా తగ్గించొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.!

STCG, LTCG

ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చే లాభాన్ని మూలధన లాభం అంటారు. ఈ లాభాలను ఆస్తిని అట్టిపెట్టుకొనే (హోల్టింగ్‌) సమయాన్ని బట్టి స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG), దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG)గా వర్గీకరిస్తారు. ఉదాహరణకు..

STCG : ఒక వ్యక్తి 24 నెలల కంటే తక్కువ సమయం ఆస్తిని కలిగి ఉండి, ఆ ఆస్తిని అమ్మితే వచ్చే లాభాలను STCG కింద పరిగణిస్తారు. పన్ను శ్లాబ్‌ ఆధారంగా ఐటీ శాఖ పన్ను విధిస్తుంది.

LTCG: 24 నెలలకు పైగా ఆస్తిని కలిగి ఉండి, ఆ ఆస్తి అమ్మకంపై ఆర్జించిన లాభంపై 20% పన్ను చెల్లించాలి. అయితే, LTCG విషయంలో పన్ను చెల్లింపుదారుకు అనేక రాయితీలు వర్తిస్తాయి. ఆస్తి అమ్మకందారుడు ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద LTCGపై మూలధన పన్ను మినహాయింపులను పొందొచ్చు.

సెక్షన్‌ 54 మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 54 ప్రకారం.. ఇల్లు/స్థలం విక్రయించగా వచ్చిన మూలధన లాభాలను మరో ఇల్లు/స్థలంపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక వ్యక్తి లేదా HUF పన్ను మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. మినహాయింపును క్లెయిం చేయడానికి పాత ఇంటిని విక్రయించిన 2 సంవత్సరాల్లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా 3 సంవత్సరాల వ్యవధిలో కొత్త ఇంటిని నిర్మించాలి. భారత్‌లో కొనుగోలు చేసిన/ నిర్మించిన ఇంటికి సంబంధించి మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. దీర్ఘకాలిక మూలధన లాభం రూ.2 కోట్ల లోపు ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారుడు (పైన పేర్కొన్న కాలపరిమితి లోపు) రెండు ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చు. అయితే, ఈ అవకాశం అతడికి జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఉంటుంది. ఆస్తి నివాస యోగ్యంగా ఉండాలి. LTCG పరిధిలోకి రావాలి.

కొత్త ఆస్తిపై లాక్‌-ఇన్‌ పీరియడ్‌

మీరు పాత ఆస్తిని విక్రయించిన తర్వాత కొత్త ఇంటిని కోనుగోలు చేయడం/ నిర్మించడంపై మినహాయింపును క్లెయిం చేసినట్లయితే.. మీరు ఆ ప్రాపర్టీని 3 సంవత్సరాల వరకు విక్రయించకూడదట. అంటే కొత్త ప్రాపర్టీ 3 సంవత్సరాల లాక్‌-ఇన్‌కు లోబడి ఉంటుంది. అలా కాకుండా 3 సంవత్సరాల్లోపు దాన్ని విక్రయిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 54 ప్రకారం మీరు పొందిన పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఐటీ శాఖ ఉపసంహరించుకుంటుంది. అంతేగాక, కొత్త ఆస్తి అమ్మకంపై కూడా STCG కింద పన్ను వర్తిస్తుంది.

సెక్షన్‌ 54EC మినహాయింపు

ఆస్తిని విక్రయించిన అమ్మకందారుడు 6 నెలల్లోపు ఆ డబ్బును నిర్దిష్ట బాండ్లపై పెట్టుబడి పెట్టి సెక్షన్‌ 54EC కింద మినహాయింపు పొందొచ్చు. ప్రాపర్టీ అమ్మకంపై LTCG నుంచి మినహాయింపు పొందేందుకు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (REC) బాండ్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (PFC) బాండ్లు, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ లిమిటెడ్‌ (IRFC) బాండ్లలో గరిష్ఠ మొత్తం రూ.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ బాండ్లపై 5 ఏళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఏడాదికి 5.25% వడ్డీ లభిస్తుంది. సెక్షన్‌ 54EC ప్రకారం.. పన్ను మినహాయింపును పొందుతున్నవారు.. 5 సంవత్సరాల లోపు నగదుగా మార్చుకోవడానికి ఈ బాండ్లను ఉపసంహరిస్తే, మినహాయింపునకు లోబడి ఉన్న మూలధన లాభాలు పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక ప్లస్‌ ఉంటే ఇంకో మైనస్‌ ఉంది కదా..! ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయించి తీసుకోవాలి.

క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ (CGAS)

ఒక్కోసారి పైన పేర్కొన్న పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటి వారు ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును ఆ అసెస్‌మెంట్‌ సంవత్సరానికి పబ్లిక్‌ సెక్టార్ బ్యాంకుల్లోని ‘క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌’లో జమ చేయొచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్‌ చేస్తున్నప్పుడు, CGASలో ఉన్న మినహాయింపులను క్లెయిం చేయొచ్చు.

CGAS కాలవ్యవధి 2-3 ఏళ్లు మాత్రమే. ఈ సమయం లోపు మరొక రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలో లేదా అర్హత గల కంపెనీకి చెందిన ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అవసరం మేరకు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని ఉపయగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version