లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సకల సంపదలు చేకూరుతాయని నమ్ముతాం. అమ్మవారి అనుగ్రహం లేకుంటే ఎంత కష్టపడినా సంపాదించినా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చవుతుంది. మన దగ్గర నిలవదు, సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. బ్యాంక్ బాలెన్స్ మాట అటుంచితే అప్పులు పెరగటం, వృధా ఖర్చులు పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకురుతాయి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం.
అయితే ఐశ్వర్య దీపాన్ని 11 లేదా 16 లేదా 21 లేదా 41 శుక్రవారాలు ఇంట్లో వెలిగించాలి. ఈ దీపం ఇంట్లో ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41 శుక్రవారాలు ఈ ఐశ్వర్య దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధన సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ వుండదు. ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం వుంటుంది.
ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి?
మహాలక్ష్మిదేవికి ఐశ్వర్య దీపం వెలిగించడానికి కావాల్సిన వస్తువులు..
ఒక ఇత్తడి ప్లేటు
రెండు వెడల్పాటి ప్రమిదలు
రాళ్ల ఉప్పు తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి.
కలకండ, అక్షింతలు , పూజకు పువ్వులు ,
నైవేద్యం కోసం బెల్లం ముక్క, పళ్ళు, పాలు, పటికబెల్లం, కొబ్బరికాయ మొదలగునవి లేదా పరమాన్నం లేదా ఏదైనా తీపి పదార్థాలను నైవేద్యంగా ఉంచవచ్చు.
తరువాత ఇత్తడి ప్లేటును తీసుకుని అందులో పెద్దదైన ఓ ప్రమిదను ఉంచాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. తరువాత ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను వుంచాలి. దానిపై నేతితో కానీ, నువ్వుల నూనెతో గానీ రెండు ఒత్తులు ఒక్కటిగా చేసి దీపం వెలిగించాలి. పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ నివేదన నైవేద్యంగా పెట్టి మహా లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి.. ఈ దీపం వెలిగించేటప్పుడు కనకధార స్తోత్రాన్ని పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
శుక్రవారం పూట ఉదయం లేదా సాయంత్రం వెలిగించిన ఐశ్వర్య దీపాన్ని శనివారం రోజున దీపంలో ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి. దగ్గరలోని చెరువులో కానీ కాలువలో కానీ కలపవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సముద్రపు ఉప్పును మాత్రమే వాడాలి.