‘వారాహి’ ఏపీలో ఎలా తిరుగుతుంది..వైసీపీ వింత వాదన.!

-

పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తారని కథనాలు వచ్చిన దగ్గర నుంచి అధికార వైసీపీలో కాస్త అలజడి రేగినట్లు కనిపిస్తోంది. ఆయన పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేస్తారని, తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని చెప్పి వైసీపీ నేతల్లో కాస్త టెన్షన్ కనిపిస్తోంది. ఇక ఈ టెన్షన్ పవన్ బస్సు రెడీ అయ్యాక ఇంకా పెరిగినట్లు కనిపిస్తోంది..అందుకే పవన్ బస్సుపై విమర్శలు చేస్తున్నారు. పైగా ఆ బస్సు కలర్ పై అభ్యంతరాలు చెబుతున్నారు. అది ఆలీవ్ గ్రీన్ అని , అది మిలటరీ వాహనాలకు ఉపయోగిస్తారని, కాబట్టి అది సరికాదని, కావాలంటే పసుపు కలర్ వేసుకోవాలని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ వచ్చారు.

 

దీనిపై పవన్ కూడా ధీటుగానే కౌంటర్లు ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా పవన్ వారాహికి తెలంగాణ రవాణా శాఖ పర్మిషన్ ఇచ్చింది..రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. అలాగే నెంబర్ కూడా వచ్చింది. రిజిస్ట్రేషన్‌కు చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని.. రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384 ఇచ్చామని రవాణా శాఖ అధికారులు చెప్పారు. ఇక అది ఆలీవ్ గ్రీన్ కాదు..ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అని క్లారిటీ ఇచ్చారు.

దీంతో వైసీపీ వాళ్ళకు చిన్నపాటి షాక్ తగిలింది..అయినా సరే వైసీపీ వెనక్కి తగ్గట్లేదు. తెలంగాణలో రిజిస్టేషన్ అయిన వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. ఆఖరికి మంత్రి అమర్నాథ్ సైతం.. ఏపీలో రూల్స్ తాము చెప్పామని, పవన్ హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్నారేమో అని ఎద్దేవా చేశారు.

ఇక పవన్ వారాహి నంబర్ 8384 అని, ఈ నాలుగు నంబర్లు కలిపితే 23 అని, అది చంద్రబాబుకు నచ్చిన నంబర్ అని అమర్ నాథ్ కామెంట్ చేశారు.  వారాహి వాహనం ఏపీకి వచ్చాక దానిపై తాము స్పందిస్తామన్నారు. అంటే వారాహి వాహనానికి ఏదొక విధంగా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు పెట్టేలా కనిపిస్తోంది. మరి దీనిపై పవన్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news