ఏమంటా ఈటల రాజేందర్…టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచి హుజూరాబాద్ ప్రజలకు అదృష్టం కలిసొచ్చింది. ఏదో నక్క తోక తొక్కినట్లుగా….హుజూరాబాద్ ప్రజలకు వరాలే వరాలు…ఇప్పటికే ఈటలని ఓడించడానికి సిఎం కేసిఆర్..హుజూరాబాద్ ప్రజల కోసం ఎన్ని రకాల ఇచ్చారో చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో ఏ నియోజకవర్గానికి ఇన్ని వరాలు కేసిఆర్ ఇవ్వలేదు.
ఓ రకంగా చెప్పాలంటే ఉపఎన్నిక వల్ల హుజూరాబాద్ ప్రజలకు కాసుల పంట పండింది….ఇక ఉపఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ఓట్లు కొనుగోలు చేసే పనిలో పడ్డాయట. అసలు హుజూరాబాద్ ఉపఎన్నిక దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ ఉపఎన్నిక కానుంది. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్ ఎలాగైనా ఈటలని ఓడించాలనే కసితో పనిచేస్తుంది. ఎక్కడకక్కడ ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో టిఆర్‌ఎస్ ప్రతి 300 ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ని నియమించింది. అంటే ఆ ఇంచార్జ్‌ల పని ఏమి లేదు…ఓటుని నోటు ఇచ్చి కొనేయడమే అని హుజూరాబాద్‌లో టాక్. నోటు అంటే ఒక నోటుతో కాదు…అవసరమైతే నోట్ల కట్టతో కొనేయాలని చూస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పథకాల పేరిట లబ్ది పొందినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఈటల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో లాభం లేదని ఏకంగా ఓటుకు ఎంత ఇవ్వడానికైనా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటుకు రూ.10 నుంచి, 20 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఒక కుటుంబాలకైతే లక్షలు కుమ్మరించేస్తున్నారట. ప్రధాన పార్టీలు కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి వారు….గ్రామాల వారీగా ఓటర్ల లిస్ట్‌ని పట్టుకుని, వారిని వ్యక్తిగతంగా కలిసి ఓటుకు రేటు కట్టి మరీ తమ పార్టీలకు ఓట్లు వేయించుకునే పనిలో పడ్డారట. అంటే ఎన్నిరకాలుగా హుజూరాబాద్ ప్రజలకు డబ్బులు వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఈటల వల్ల హుజూరాబాద్ ప్రజలకు అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి.