రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నాయి.
కాగా, పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వారి సభ్వత్యాన్ని రద్దు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు విన్నవించుకున్న విషయం తెలిసిందే. నాలుగు వారాల్లోగా పార్టీ మారినవారిపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ప్రతిపక్షంలోనే ఉన్నానని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. దీంతో కౌశికరెడ్డి, గాంధీ మధ్య చెలరేగిన వివాదంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.