మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పన అనే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాము.. ఐబీ సిలబస్ కు లెటర్ ఆఫ్ ఇండెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. అమెరికాలో ఉన్న సిలబస్ ను ఇక్కడ అమలు చేస్తాం.. నిజ జీవితానికి దగ్గరగా ఈ సిలబస్ ఉంటుంది.. ఎమ్ఓయూ చేసుకున్నాం.. వారానికి ఒక రోజు టోఫెల్ పై ఇప్పటికే శిక్షణ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు 2023కి ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. దీని వల్ల 10 వేల మంది ఉద్యోగులకు లబ్ది పొందుతారు. ఏపీజీపీఎస్ బిల్లు -2023 కు క్యాబినెట్ ఆమోదం పొందిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ సమయానికి ఇంటి స్థలం కేటాయించటం ప్రభుత్వం తమ బాధ్యతగా తీసుకుందని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.
పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం తెలపడమే కాకుండా భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలిపింది. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం లభించింది. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం. ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం తెలిపారు.