మరో వివాదంలో బిగ్ బాస్ షో..త్వరలో ఆపేస్తారా?

-

బిగ్​ బాస్ రియాల్టీ షోపై చాలా కాలంగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే.ఈ షో నిర్వహణపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్ని వచ్చినా కూడా నెంబర్ వన్ గా పాపులారిటీ సాధించింది. ఈ షో కల్చర్ ను పూర్తిగా డామేజ్ చేస్తుందని, దీనిని వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది సమాజంలో విష సంస్కృతిని పెంచుతోందని మండిపడ్డారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి బిగ్ బాస్ షోలకు ఎలా అనుమతులు ఇస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 6 షోను నిలిపివేయాలని కోరుతూ.. నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బిగ్ బాస్ షో చాలా అశ్లీలంగా ఉంటోందని, అందులో పాల్గొనేవారి భాష దారుణంగా ఉంటుందని ఆయన కోర్టుకు తెలిపారు.అలాంటి షోను రద్దు చేయాలని లేదా రాత్రి 11 గంటల తర్వాత తెల్లవారు ఝామున 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు.ఆ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించి శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఈ షోపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్ వాదన వినిపించారు..

బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలను నియంత్రించే ఉద్దేశం ఉందా లేదా అని ఏపీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇటువంటి షోలు సెన్సార్ లేకుండా ప్రసారమవుతున్నాయని,ఈ షోల ప్రదర్శన విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయమని కోర్టు కేంద్ర హోం శాఖ, సమాచార ప్రసారాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ లకు నోటీసులు జారీ చేసింది.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విచారణను 11 కు వాయిదా వేశారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.ఈ షో పై వస్తున్న వార్తల పై రకరకాల పుకార్లు షికారులు చేస్తున్నాయి. మొత్తానికి ఈ షో వుంటుందా ..ఉండదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version